హైదరాబాద్, వెలుగు: ఇండో అమెరికన్చాంబర్ఆఫ్ కామర్స్, తెలంగాణ వీఎఫ్ఎక్స్, యానిమేషన్ గేమింగ్ అసోసియేషన్ (టీవీఏజీఏ) ప్రభుత్వ సహకారంతో "ది వరల్డ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ - యానిమేషన్, ఫిల్మ్ గేమింగ్" అనే అంశంపై టీ–హబ్‌లో సమావేశాన్ని నిర్వహించాయి. రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు దీనిని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ యానిమేషన్, గేమింగ్, వీఎఫ్ఎక్స్ ఫిల్మ్‌లలో భారతదేశం మొదటి స్థానంలో ఉందని అన్నారు. తెలంగాణ నుంచి హాలీవుడ్ 3,000 సినిమాల వరకు ఔట్‌సోర్స్ చేసిందని, సోనీ, కామ్‌కాస్ట్, నెట్‌ఫ్లిక్స్ వార్నర్‌బ్రదర్స్ వంటి పెద్ద పెద్ద కంపెనీలు మనదేశంలో ఇన్వెస్ట్ చేశాయని చెప్పారు.
ఐటీ, పరిశ్రమలశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేశ్ రంజన్ మాట్లాడుతూ వీఎఫ్ఎక్స్, యానిమేషన్ గేమింగ్‌లకు తెలంగాణ ప్రధాన గమ్యస్థానమని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వ ఎకో సిస్టమ్ స్టార్టప్‌లకు ఎంతగానో సహాయం చేస్తున్నదని చెప్పారు. ఈ రంగానికి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సెంటర్ అయిన ఇమేజ్ ఇంక్యుబేషన్‌ను ప్రారంభించిందని ఆయన తెలియజేశారు.